రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత మెరుగ్గా ఉండాలి.. ప్రజలకు కొత్త ఇబ్బందులు రావద్దు - సీఎం
CM KCR Review Meeting On Registrations. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా
By Medi Samrat Published on 13 Dec 2020 1:33 PM GMTఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు.
ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమయి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని సీఎం ఆదేశించారు.
వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతున్నదని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో కూడా అలాంటి విధానమే రావాలని సీఎం ఆకాంక్షించారు.
వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతున్నది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు. ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావద్దు. ఏ అధికారి కూడా తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలి. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.