దళితబంధు గత సంవత్సరమే ప్రారంభమయ్యేది.. కానీ..
CM KCR Review Meeting On Dalitha Bandu. దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం
By Medi Samrat Published on 27 Aug 2021 7:43 PM ISTదళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని.. నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని.. ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రో గాని ఇది దుర్మార్గమైన ఆచారమని.. ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన. దళితబంధు గత సంవత్సరమే ప్రారంభమయ్యేది, కానీ కరోనా కారణంచేత ఆలస్యమైంది. ఇప్పుడు దళితబంధు మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, తప్పకుండా విజయవంతం చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం అని సీఎం అన్నారు.
తెలంగాణ జనాభాలో 18 శాతం దళితులు ఉన్నారు. దళిత జనాభా పెరుగుతున్నది. దాని తగ్గట్లు రాబోయే కాలంలో వారి రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం అని సీఎం అన్నారు. తెలంగాణ కోసం నేను కదిలిన నాడు నా వెంట మీరంతా కదిలిండ్రు, తెలంగాణను సాధించుకునే దాకా నా వెంట నడిచిండ్రు, నేను కోట్లాడితే నాకు సహకరించిండ్రు. గత ఏడు యెండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడుతున్నారు. తెలంగాణ పోరాటంలో మీ సహకారం నిజమైనదైతే తెలంగాణ దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమ స్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా నాకు సహకారం అందించాలే అని సీఎం పిలుపునిచ్చారు.
హుజురాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచనున్నదని, అణగారిన దళిత వర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుందన్నారు. ఎట్లైతే స్పష్టమైన అవగాహనతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ముద్దాడామో అంతే స్పష్టమైన అవగాహనతో దళిత బంధు ఉద్యమాన్ని నడిపించి.. గమ్యాన్ని ముద్దాడుతాం అని సీఎం స్పష్టం చేశారు.