తెలంగాణకు కరువన్నదే రాదు : సీఎం కేసీఆర్‌

CM KCR Review Meeting On Agriculture. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం

By Medi Samrat  Published on  19 April 2022 2:27 PM GMT
తెలంగాణకు కరువన్నదే రాదు : సీఎం కేసీఆర్‌

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని సీఎం అన్నారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సీఎం సూచించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం అన్నారు.

ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధత పై ప్రగతి భవన్ లో ఈ రోజు సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వరి ధాన్యం సేకరణ పురోగతిపై అధికారులను సీఎం ఆరాతీసారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు మరింత విస్తృతంగా క్రేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు నిరంతరం పంటపొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలన్నారు. ఆ దిశగా అవగాహన పెంపొందించాలని, అందుకు ఏఈ అధికారులకు నిరంతరం శిక్షణా తరగతులను నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి సీఎం సూచించారు. వ్యవసాయ అధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణ పై జాబ్ చార్ట్ తయారు చేయాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ''తెలంగాణలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా ఉంది. సరిపడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం ఆశాజనకంగా ఉండబోతున్నది. రైతులు యాసంగి పనులను ముగించుకున్నరు. వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ లోపే అవసరమయ్యే ఎరువులు విత్తనాలు సరిపడా సమకూర్చుకోవాలి. రైతులకు ఎటువంటి లోటు రాకుండా వాటిని అందుబాటులో ఉంచుకోవాలి. కల్తీ విత్తనాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేడు తెలంగాణ వ్యవసాయం గొప్పగా పురోగమిస్తున్నది.

ఉమ్మడి పాలనలో నాడు నామమాత్రంగా వున్న వ్యవసాయ రంగం, నేడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్ర జిఎస్డిపీకి 21 శాతం దోహదపడుతున్నది. ఇది మామూలు విషయం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం కీలకంగా మారింది. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు మరింతగా విస్తరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయి.'' అని సీఎం అన్నారు.

''భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ రంగానికి ఇక కరువు అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగ వేగాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అందుకుంటూ ముందుకు సాగాల్సి వున్నది. వ్యవసాయ శాఖ నిరంతరం వైబ్రంట్ గా, బిజీ బిజీగా వుండాల్సి వున్నది..'' అని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సీఎం సూచించారు.

వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను (డిస్ట్రిక్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్) చేపట్టాలని సీఎం అన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లను, ఆర్డీవోలను కూడా భాగస్వాములను చేయాలన్నారు.























Next Story