యాసంగిలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ‌వు : సీఎం కేసీఆర్

CM KCR Press Meet Highlights. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు

By Medi Samrat  Published on  29 Nov 2021 2:32 PM GMT
యాసంగిలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ‌వు : సీఎం కేసీఆర్

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేబినెట్ భేటీ అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యంపై కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. దేశ రైతాంగాన్ని కేంద్రం గందరగోళానికి గురి చేస్తోందని ఆరోపించారు. కేంద్రం చిల్లర కొట్టు షావుకారుగా వ్యవహరిస్తోందని, ఆహార భద్రత సామాజిక బాధ్యత అని చెప్పారు. నష్టం వస్తే కేంద్రం భరించాలని.. నిల్వలు ఎక్కువైతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. గ్యాస్, పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని విమర్శించారు.

బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని.. రా రైస్ ఎంత తీసుకుంటారో కూడా కేంద్రం చెప్పలేదని కేసీఆర్ అన్నారు. 90లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరామ‌ని తెలిపారు. యాసంగిలో వడ్లు పండితే నూక ఎక్కువగా వస్తుందని.. నష్టపోకుండా ఉండేందుకే మిల్లర్లు బాయిల్డ్ రైస్ చేస్తున్నారని అన్నారు. మెడపై కత్తిపెట్టి కేంద్రం బలవంతంగా అగ్రిమెంట్ రాయించుకుందని విమ‌ర్శించారు. ఢిల్లీకి వెళ్తే మొహంలేక మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని విమ‌ర్శ‌లు గుప్పించారు. విభజన చట్టం ప్రకారం.. కేంద్రం సహకారం అందివ్వడం లేదని ఆరోపించారు. ఈ నేఫ‌థ్యంలోనే యాసంగిలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండ‌వని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కేంద్రం చేతులేత్తేసింది కాబ‌ట్టే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.


Next Story