ఉద్యమకారులు, మేధావులు, హక్కుల నేతలపై ఉపా కేసులు నమోదయ్యాయి. హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, విమలక్క, గడ్డం లక్ష్మణ్ తో పాటు ప్రజాసంఘాల నేతలు, మేథావులు, విద్యార్థి నాయకులు పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ కేసు వివరాలన్నీ ఆలస్యంగా వెలుగులోకి రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. దాదాపు 152 మంది అభియోగాలు మోపారు పోలీసులు. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫ్రెసర్ హరగోపాల్‌తో పాటు ఉపా చట్టం కింద 152 మందిపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఉపా చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్ మీద దాఖలు చేసిన దేశద్రోహం కేసును ఎత్తేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మంది పైనా కేసులు తక్షణమే ఎత్తేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా-UAPA) కింద హరగోపాల్‌తో పాటు 152 మందిపైనా కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్‌పై యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ దేశద్రోహం కేసు ఆలస్యంగా వెలుగు చూసింది.