షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు
CM KCR On Assembly Elections. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని
By Medi Samrat Published on 15 Nov 2022 5:45 PM ISTముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.
ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది.. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో మాట్లాడాలని.. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. సర్వేలన్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని.. వంద శాతం మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారమని అన్నారు. మునుగోడు తరహాలో పటిష్ట ఎన్నికల వ్యూహం తయారు చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా పని చేయాలి.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థంగా తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారు. బీజేపీ కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తన పని తాను చేస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని.. బీజేపీతో పోరాడాల్సిందేనని కేసీఆర్ అన్నారు.