సంగారెడ్డి జిల్లా సింగూరు ఆనకట్టపై నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమవారం శంకుస్థాపన చేశారు. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే సంగారెడ్డిలో 57 వేల ఎకరాలు, జహీరాబాద్‌లో 1.06 లక్షల ఎకరాలు, ఆంధోల్‌లో 56 వేల ఎకరాలు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు అంటే మొత్తం 3.84 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వే పూర్తి చేసి నీటిపారుదల శాఖ రూపొందించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు అనుమతి లభించింది. సింగూరు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
మరోవైపు కాలువలు, పంప్‌హౌస్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,427 కోట్లు ఖర్చు చేయనుంది. నారాయణఖేడ్ జిల్లా మనూరు మండలం బోరంచ వద్ద బసవేశ్వర ప్రాజెక్టును నిర్మిస్తుండగా, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయిఖోడ్ మండలం అయిదులాపూర్ వద్ద సంగమేశ్వర ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, ఆంధోలు నియోజకవర్గాల్లోని 12 మండలాల్లోని 231 గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. బసవేశ్వర ప్రాజెక్ట్‌తో నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లోని 166 గ్రామాలకు సాగునీరు అందనుంది.