ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, స్మితా సబర్వాల్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది.