ఇప్పటిదాకా ఆగాను.. ఇప్పుడు షో చూపించాల్సిన టైం వచ్చింది: కేసీఆర్
CM KCR latest comments on BJP and munugode bypoll. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
By అంజి Published on 3 Nov 2022 3:33 PM GMTకేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని, వీరి వల్ల దేశం పునాదులకే ప్రమాదకరం అని అన్నారు. గురువారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశాన్ని చాలా భారమైన దుఃఖంతో నిర్వహిస్తున్నానని సీఎం చెప్పారు. దేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తోందని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య నాడిని బీజేపీ కలుషితం చేస్తోందన్నారు.
మనకి ఊహకి కూడా అందనంత భయంకరంగా చేస్తున్నారు. అందుకే చాలా బాధతో మాట్లాడుతున్నానని కేసీఆర్ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ''దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఇప్పటిదాకా ఆగాను. ఇప్పుడు షో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి నన్ను కలిసినట్లు బిజెపి వాళ్లు ఆరోపణలు చేశారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి గెలుపోవటం అనేవి సహజం. ప్రజా తీర్పు గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.'' అని సీఎం కేసీఆర్ అన్నారు.
బిజెపి వాళ్లు ఎలక్షన్ కమిషనర్ పైన కూడా తీవ్ర ఆరోపణలు చేశారని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్‌ని నియమిస్తుంది. వాళ్ల పైన వాళ్లే ఆరోపణలు చేస్తున్నారు. వారిని గెలిపిస్తే ఎలక్షన్ కమిషన్ మంచిది, ఓడగొడితే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అంటారని కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాలుగు మూల స్తంభాలను బిజెపి నిర్వీర్యం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. అత్యున్న సమయంలో కూడా తాము ఇంత హీనంగా ప్రవర్తించలేదని కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోందని, దుర్మార్గపు పద్ధతుల్లో ముందుకు పోతున్నారని కేసీఆర్ అన్నారు.