అంజన్న సన్నిధిలో కేసీఆర్‌.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతాం

CM KCR Kondagattu Tour Update. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

By Medi Samrat  Published on  15 Feb 2023 9:27 AM GMT
అంజన్న సన్నిధిలో కేసీఆర్‌.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతాం

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వామి వారిని దర్శించుకున్నారు. కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి అధికారులతో రెండు గంటలకుపైగా సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు పేరే రావాలి.. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలనుకుంటున్న‌ట్లు సీఎం తెలిపారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని సూచించారు.

దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని అభిలషించారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేసే సమయంలో ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని.. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా చూడాలని ఆల‌య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలని.. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీని అభివృద్ధి చేయాలని.. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని అన్నారు. మళ్ళీ వస్తా.. ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం అన్నారు.


Next Story