తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కుర్చీలో ఆసీనులయ్యారు. ఆపై కేసీఆర్ ఆరు పైళ్లపై సంతకాలు చేశారు. సీఎం కేసీఆర్‌కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, పలువులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.
అంతకుముందు సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మేయిన్ గేట్ వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడినుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.