జనగాంలోని నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు. 25 ఎకరాల్లో రూ.58.20 కోట్లతో కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లా దుస్థితిని గుర్తుచేస్తూ జనగాం జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు.
''జిల్లాలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి నేనూ, ప్రొఫెసర్ జయశంకర్ కలత చెందాం. సిద్ధిపేట నుంచి వరంగల్ వెళ్లేందుకు బచ్చన్నపేటలో బస చేశాం. సభకు హాజరైన పలువురు వృద్ధులు జిల్లా కరువు కాటకాలతో అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవాలి.. కానీ ఇప్పుడు రాష్ట్రావతరణ తర్వాత ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, అవినీతికి తావులేకుండా ఉందని సీఎం అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జనగాంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం యశ్వంత్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు.