సీఎం కేసీఆర్ హుజూరాబాద్ షెడ్యూల్ ఇదే..!
CM KCR Huzurabad Visit Schedule. హుజురాబాద్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి టూర్
By Medi Samrat
హుజురాబాద్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి టూర్ షెడ్యూల్ ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ హుజురాబాద్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సభస్థలికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభలో పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ చేతులమీదుగా సోమవారం లాంఛనంగా 15 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను అందించనున్నారు.ఈ బహిరంగ సభలో కేసీఆర్ దళితుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం అమలు చేసే తీరును, చేపట్టిన, చేపట్టనున్న ఇతర కార్యక్రమాలను వివరించనున్నారు.
సీఎం సభ ఏర్పాటు చేసిన ప్రాంతంతో ఓ సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంది. 2018 మేలో ఇదే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సైతం ఇదే శాలపల్లి వేదికగా ప్రారంభించడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల కంటే ఈ పథకం ఆది నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సభా ప్రాంగణంలోని స్టేజీపై సుమారు 250 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెయిన్‌ఫ్రూఫ్ టెంట్లతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్-జమ్మికుంట రోడ్డు పక్కన గల శాలిపల్లి-ఇంద్రానగర్‌లో 20 ఎకరాల్లో 1.20లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దళితబంధు పథకం ఇవ్వడం కోసం మొదట్లో ఐదువేల కుటుంబాలను ఎంపిక చేశారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. దళితబంధు పథకం ఎంపికలో అనర్హులను కేటాయించారని నిరసన సెగలు తగలడంతో 15మందికి మాత్రమే సీఎం చేతుల మీదుగా దళితబంధు చెక్కులు అందజేయనున్నారు.