రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యం : సీఎం కేసీఆర్‌

CM KCR has conveyed his greetings to the handloom workers. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు సీఎం

By Medi Samrat  Published on  7 Aug 2021 10:28 AM GMT
రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యం : సీఎం కేసీఆర్‌

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్ లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.


చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నదన్నారు. బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, ఆర్థికంగా చేనేత కుటుంబాలకు భరోసానిస్తున్నామన్నారు. వారి ఆత్మగౌరవం పెంచే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని సీఎం తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను గుర్తించి సత్కరించుకుంటున్నామన్నారు. 'కొండా లక్ష్మణ్ బాపూజీ' పేరుతో అవార్డులు అందిస్తున్నామని సీఎం అన్నారు.

ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలులోకి తేనున్నామన్నారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనన్నారు. చేనేత కార్మికులకు అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని సీఎం తెలిపారు.

చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్నలకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాల ద్వారా చేనేత సొసైటీలకు ప్రభుత్వం వాటా ధనాన్ని అందించడం, కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు సబ్సిడీలు అందించడం, చేనేత మగ్గాలను ఆధునీకరించడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విజయవంతగా అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. అవి సత్పలితాలనిస్తున్నాయని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. పద్మశాలీలను సామాజిక ఆర్థిక రంగాల్లోనే కాకుండా రాజకీయ పాలనా వ్యవస్థల్లో కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు.


Next Story
Share it