భద్రకాళి ఆలయ పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం..!
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి, పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వ నిబద్ధత కొనసాగుతోంది.
By అంజి Published on 26 May 2023 3:30 AM GMTభద్రకాళి ఆలయ పునర్నిర్మాణానికి సర్వం సిద్ధం..!
వరంగల్: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధి, పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వ నిబద్ధత కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ సంకల్పంతో ఇప్పటికే యాదాద్రి కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అటు వేములవాడ, కొండగట్టు ఆలయ పనులు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా వరంగల్ నగరంలోని ప్రఖ్యాత భద్రకాళి ఆలయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భద్రకాళి ఆలయాన్ని సరికొత్తగా నిర్మించేందుకు సర్వం సిద్ధమయ్యింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి ట్యాంక్‌కు ఆనుకుని, కొండల మధ్య, నిర్మలమైన ప్రకృతి అందాల మధ్య నెలకొని ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయం విశేషమైన రూపాంతరం చెందనుంది.
చారిత్రక కథనాల ప్రకారం.. ఈ ఆలయాన్ని మొదట పశ్చిమ చాళుక్య ప్రభువైన పులికేశి- II నిర్మించారు. అతను వేంగి చాళుక్యులను జయించాలనే తపనతో భద్రకాళి దేవిని ఆరాధించాడు. ఆలయ వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల దాని అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు, పవిత్ర స్థలం కోసం తాజా రూపాన్ని వాగ్దానం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రాజగోపురం (ప్రధాన ద్వారం గోపురం), భద్రకాళి మాడ వీధుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజగోపురం, మాడ వీధుల సాకారం కోసం ప్రభుత్వం ఉదారంగా రూ.30 కోట్లు మంజూరు చేయడంతో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు నిశితంగా డిజైన్‌ను రూపొందించారు.