జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
CM KCR Good News to Contract Lecturers. అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయ
By Medi Samrat
అర్హత కలిగివుండి, భర్తీకి అవకాశం వున్న ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి వెల్లదలుచుకున్న, జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కుంటున్న సమస్యల మీద సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.
జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వారిని రెగ్యలరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయింది. అయినా అంతటితో ఆగకుండా వారి నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేసింది ప్రభుత్వం. సంవత్సర కాలానికి కేవలం పదినెలలు మాత్రమే జీతాలు చెల్లించే పరిస్థితి గతంలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని పన్నెండు నెల్లకు పెంచి సంవత్సర కాలం పూర్తి జీతం ఇస్తున్నది. దాంతో పాటు వారికి సర్వీసు బెనిఫిట్స్ ను కూడా అందిస్తున్నం. సెలవులను పెంచినం. కాజువల్ లీవులు, మెటర్నిటీ లీవుల సదుపాయాలను కల్పించినం. ఇంక కూడా సాధ్యమైనంత మేరకు, నిబంధనలు అనుమతించిన మేరకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం స్పష్టం చేశారు.
తమకు అనువైన మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలనే జూనియర్ కాలేజీ లెక్చరర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని నియమ నిబంధనలను అన్ని కోణాల్లో పరిశీలించి, అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.