దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ : మంత్రి హరీశ్‌ రావు

Cm Kcr Giving High Priority To Government Hospitals And Health Department. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2022 లో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ఆరోగ్య శాఖ

By Medi Samrat  Published on  29 Jan 2023 1:04 PM GMT
దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రం తెలంగాణ : మంత్రి హరీశ్‌ రావు

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 2022 లో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ఆరోగ్య శాఖ వార్షిక నివేదిక -2022ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు ఆదివారం MCRHRD లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు ప్రసంగిస్తూ.. వైద్యరంగానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2022లో దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నీతిఆయోగ్‌ గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా హరీశ్‌ రావు పేర్కొన్నారు. మాతా, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు.

గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌, 7 పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని హరీశ్‌ రావు అన్నారు. వరంగల్‌లో రూ.11వందల కోట్లతో 2వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు పెరిగిన రోగులు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్‌ కిట్స్‌ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 2021లో 4 కోట్ల 21 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పొందారని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. 2022లో 4 కోట్ల 60 లక్షల మందికిపైగా ఓపీ సేవలు వినియోగించుకున్నారని తెలిపారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా 30 లక్షలకు పైగా పెరిగిందని అన్నారు. 2022లో బస్తీ దవాఖానాల్లో 47 లక్షల మంది ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారని చెప్పారు. ఎన్‌సీడీసీ స్క్రీనింగ్‌ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

నార్మల్‌ డెలివరీలకు ఇన్సెంటివ్స్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య 61 శాతం పెరిగిందని హరీశ్‌ రావు తెలిపారు. నార్మల్‌ డెలివరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. నార్మల్‌ డెలివరీకి ఇన్సెంటివ్స్‌ కూడా ఇచ్చామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం కూడా అభినందించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2021లో 2.57 లక్షలు, 2022లో 3.04 లక్షల సర్జరీలు చేశామని తెలిపారు. 2022లో 5.40 లక్షల డెలివరీలు జరిగ‌గా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3.27 లక్షల డెలివరీలు జరిగాయని చెప్పారు. అంటే దాదాపు 62 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని అన్నారు. ఆస్పత్రుల్లో డెలివరీలను 99.9 శాతానికి పెంచామని పేర్కొన్నారు. డెలివరీ సమయంలో చనిపోయే తల్లుల సంఖ్య తెలంగాణలో 43 మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్‌ యాత్రాలు ఏర్పాటు చేశామని చెపారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ టీమ్‌ ఏర్పాటుచేశామన్నారు. వసతులు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు.


Next Story