స‌మ‌స్య‌ల‌పై గట్టిగా గొంతెత్తండి : ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం

Cm KCR Gave Suggestions To Brs Mps For Discuss In Parliament Amid Union Budget Session. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ

By Medi Samrat  Published on  29 Jan 2023 7:36 PM IST
స‌మ‌స్య‌ల‌పై గట్టిగా గొంతెత్తండి : ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం

కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జ‌రిగిన‌ బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జ‌రిగిన తొలి పార్లమెంటరీ పార్టీ సమావేశం కావ‌డం విశేషం. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో దేశంతో పాటు రాష్ట్రంలోని అనేక అప‌రిష్కృత‌ అంశాలపై చర్చించారు.

ఈ సంద‌ర్భంగా.. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గొంతుని వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని సీఎం ఎంపీల‌తో అన్నారు. ఈ దిశగా బీఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారినాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర ఆర్ధిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలని ఎంపీల‌కు సూచించారు. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖంఢించాల‌ని దిశానిర్దేశం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ విష‌య‌మై పార్లమెంటులో నిలదీయాలని ఎంపీల‌కు సూచించారు. ప్రగతి పథంలో నడుస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ ప్రగతిని అడ్డుకుంటున్న కారణమేందో జాతికి చెప్పాలని.. దీనిపై కేంద్రాన్ని నిలదీయాల్సి వున్నదని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. గవర్నర్ల వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. గవర్నర్ల వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న విధానాలను బిఆర్ఎస్ ఎంపీలుగా ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని ఎంపీల‌కు సూచించారు.

దేశ భవిష్యత్తు కోసం, ప్రజా సమస్యల మీద పార్లమెంటులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మీద పోరాటానికి మనతో కలిసివచ్చే ప్రతిఒక్క పార్టీ ఎంపీని కలుపుకుని పోవాల‌ని ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. పెట్రోల్, డీజిల్ సహా వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుద‌ల‌పై సామాన్య ప్రజలు అనుభవిస్తున్న బాధలను కష్టాలను పార్లమెంటు ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకపోవాల‌ని కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

రోజు రోజుకూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నదని, దేశ యువతను ఏమాత్రం పట్టించుకోకుండా, వారికి ఉద్యోగ భధ్రత కల్పించకుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ తీరని నష్టం చేస్తున్నది. ఈ అంశం పై గట్టిగా గొంతు వినిపించాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన విభజన హామీల పై కేంద్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని, ఇందుకు సంబంధించీ గొంతెత్తాలని ఎంపీల‌కు సూచించారు. తెలంగాణకు రావాల్సిన అనేక హక్కులను రాబట్టే దిశగా పార్లమెంటులో గొంతు వినిపించాలని దిశానిర్దేశం చేశారు.


Next Story