తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ విభజన హామీల పరంగా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారని, తెలంగాణకు చెందిన ఏడు మండలాలను కర్కశంగా ఏపీలో కలిపేశారని విమర్శించారు. అసెంబ్లీకి ప్రతిపాదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏపీకే ఇచ్చేశారని.. ప్రధాని మోదీ నిర్వహించిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఏపీలోని కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉందని అన్నారు. తాను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. ఏపీకి రూ.3 వేల కోట్ల విద్యుత్ బకాయిలు కట్టాలని కేంద్రం చెబుతోందని, నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామని అంటోందని తెలిపారు. మరో రూ.3 వేల కోట్లు వడ్డీ అంటోందని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణకే రూ.17,280 కోట్లు రావాల్సి ఉందని, అందులో రూ.6 వేల కోట్లు మినహాయించి మిగతా మొత్తాన్ని కేంద్రమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.