డ్రగ్స్ కేసులలో ఎవరినీ విడిచిపెట్టవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వ్యాప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డ్రగ్స్ నిర్మూలనపై వినూత్నంగా ఆలోచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాజిక ఉద్యమంగా మారినప్పుడే సాధ్యమవుతుందని సీఎం అన్నారు. ఈరోజు ప్రగతి భవన్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు సృజనాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పోలీసు, ఎక్సైజ్ అధికారులను సీఎం ఆదేశించారు. సుశిక్షితులైన సిబ్బందిని నియమించాలని, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణ విభాగం పటిష్టంగా పనిచేయాలని, పనిలో రాణిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాలని, అందుకోసం ప్రభుత్వం కూడా తగినన్ని నిధులు మంజూరు చేస్తుందని, నియంత్రణలో భాగంగా ఎవరినీ విడిచిపెట్టవద్దని సీఎం సూచించారు. నేరస్తుల విషయంలో నాయకుల నుండి ఎటువంటి వత్తిడి ఉన్న ఉపేక్షించవద్దని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎంపీలు బీబీపాటిల్, కవితానాయక్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగత్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శి రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు.