తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌..వారికి చాన్స్ ఇస్తే ఆగమే: కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  20 Nov 2023 5:28 PM IST
cm kcr, brs, telangana, elections, campaign,

తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌..వారికి చాన్స్ ఇస్తే ఆగమే: కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులంతా ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్తున్నారు. సీఎం కేసీఆర్ రోజకు మూడు నుంచి నాలుగు నియోజవర్గాల సభల్లో పాల్గొంటున్నారు. ఈక్రమంలో ఆయన సోమవారం స్టేషన్‌ ఘనపూర్‌లో బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించి.. ఆలోచించి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్. తమకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అడుగుతోందని.. వాళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో ఓటు వజ్రాయుధం లాంటిదని.. అది హక్కు సరిగ్గా వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే ధరణిని రద్దు చేసి దాని ప్లేస్‌లో భూమాత అనే స్కీమ్‌ తీసుకొస్తామని చెబుతున్నారు. వాళ్లు తెచ్చేది భూమాత కాదు.. భూ మేత అంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని స్కాంగ్రెస్‌ పార్టీగా అభివర్ణించారు సీఎం కేసీఆర్. అసలు తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ అని.. ఆ పార్టీకి మళ్లీ ఓటేసి గెలిపిస్తే పూర్తిగా ఆగం అవుతమాన్నారు.

పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్న సీఎం కేసీఆర్.. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణను ఉంచామన్నారు. అసలు బీఆర్ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు. ఏళ్ల పాటు పోరాటాలు చేసి.. బలిదానాలు జరిగిన తర్వాత అప్పుడు దిగొచ్చి తెలంగాణను ప్రకటించారని అన్నారు. తెలంగాణ రాకముందు ఇక్క ఆకలి చావులు, కరువు, వలసలు ఉండేవన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కనీసం తాగునీరు సరిగా ఇవ్వలేదనీ,.. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీళ్లు ఇస్తుందని గుర్తు చేశారు. స్టేషన్‌ ఘనపూర్‌లో 1.10 లక్షల ఎకరాలకు నీళ్లందించామన్నారు. కాంగ్రెస్‌ కర్ణాటకలో గెలిచి అక్కడి రైతులను మోసం చేసిందని చెప్పారు. కరెంటు అందక అక్కడ రైతులు గోస పడుతున్నారనీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్‌ పార్టీనే శ్రీరామ రక్ష అని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు.

Next Story