ప్రతిపక్ష నేతలు నోటికొచ్చిన అబద్ధం చెప్తున్నారు: సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  5 Nov 2023 5:30 PM IST
cm kcr, brs, kothagudem, meeting,  elections,

ప్రతిపక్ష నేతలు నోటికొచ్చిన అబద్ధం చెప్తున్నారు: సీఎం కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని.. అభివృద్ధిని కొనసాగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఎప్పుడూ నష్టాల్లోనే కొనసాగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన వెంటనే సింగరేణి ఉద్యోగులకు 3 శాతం ఇంక్రిమెంట్‌ ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పానలలో సింగరేణి టర్నోవర్‌ రూ.11వేల కోట్లు మాత్రమే ఉండేదని చెప్పారు. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు అయ్యేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంకు ప్రభుత్వ వైద్యశాలను తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. అంతేకాదు.. ఇదే నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూములకు పట్టాలు కూడా ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో చేసిందేంటని ఆయన ప్రశ్నించారు. వారు అన్ని ఏళ్లలో చేయలేని పనులను తాము తక్కువ సమయంలోనే చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఎన్నికల సమయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయని.. కానీ ప్రజలే ఆలోచించుకుని అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అయితే.. ప్రత్యేర్థులను విమర్శించేందుకు కొందరు బూతులు మాట్లాడుతున్నారంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. నోటికి వచ్చిన అబద్ధం చెబుతున్నారంటూ విమర్శించారు. అయితే.. ప్రతి అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుంది.. ఆ పార్టీ వైఖరి.. చరిత్రను చూసి గెలిపించాలన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.

Next Story