తిమ్మాపూర్‌లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గతంలో పోలిస్తే ఇప్పుడు ఈ ప్రాంతం చాలా మారిపోయిందని అన్నారు. తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వేంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదని, ఇప్పుడు గుడిచుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని అన్నారు. బాన్సువాడ నియోకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కష్టపడ్డారని. పోచారం వయసు పెరుగుతోందని అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. తనకు కూడా 69 ఏళ్లు వచ్చాయని... ముసలోడిని అవుతున్నానని చెప్పారు.
బాన్సువాడకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. స్వామివారి కరుణ బాన్సువాడ మీద, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉండాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. వేంకటేశ్వర స్వామి గుడి బాగు కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అప్పట్లోనే అనుకున్నామని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కొందరు మిత్రులతో వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తనను కోరారని తెలిపారు.