నా లైన్‌ను ఎవ్వరూ మార్చలేరు.. అప్ప‌టి వ‌ర‌కూ విశ్రమించను

CM KCR About Telangana Development. టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ.. సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో

By Medi Samrat  Published on  16 July 2021 7:46 PM IST
నా లైన్‌ను ఎవ్వరూ మార్చలేరు.. అప్ప‌టి వ‌ర‌కూ విశ్రమించను

టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ.. సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రమణ, ఆయన అనుచరులకు పార్టీలోకి స్వాగతం ప‌లికారు. రమణ 25 యేండ్లుగా వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడని.. రమణ ఏ పార్టీ లో ఉన్నా.. ఆ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని.. ఇలాంటి వారు రాజకీయ పార్టీలకు కావాలని అన్నారు.

తెలంగాణ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తోందని.. 40 ఎకరాలు అమ్మితే 2వేల కోట్లు వచ్చాయి.. కబ్జాలకు గురయ్యే అవకాశాలున్న చోటే భూములు అమ్ముతున్నామ‌ని.. భూములు అమ్మిన డబ్బులు పేదల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామ‌ని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందని.. కొందరు సన్నాసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యోగులు ఇప్పుడు దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.

చేనేత రంగం కష్టాలు నాకు తెలుసున‌ని.. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులను ఉద్యమ సమయంలో పార్టీ తరపున ఆదుకున్నామ‌ని.. చేనేత బీమా పథకం రెండు, మూడు నెలల్లో మొదలవుతుందని కేసీఆర్ అన్నారు. చేత్తో నేసే వారే కార్మికులు కారు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేత కార్మికులు మారిన నేపధ్యాన్ని గమనించి నిర్ణయం తీసుకుంటామ‌ని.. త్వరలోనే చేనేత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు.

తెలంగాణ కోసం అందరూ కాడి కిందపెట్టినపుడు నేను ఒక్కడిగా జెండా ఎత్తాన‌ని.. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గా ఒంటరిగా బయలుదేరానని గుర్తుచేశారు. ఒకపుడు తెలంగాణలో వ్యవసాయ రంగం నుంచి రూ.16 వేల కోట్ల రూపాయలు జీడీపీగా లభిస్తే.. అదిప్పుడు రూ.50 వేల కోట్లకు చేరిందని అన్నారు. తలసరి విద్యుత్ లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం అని.. ఒకపుడు తెలంగాణ‌లో తలసరి విద్యుత్ వినియోగం 1070 యూనిట్లు ఉంటే.. ఇపుడు 2170 యూనిట్లకు చేరిందని అన్నారు. కరెంటు లో అట్టడుగున ఉన్న తెలంగాణ ఇపుడు అగ్రభాగానికి చేరిందని తెలిపారు.

ధరణి ఒక విప్లవం అని కేసీఆర్ అన్నారు. రైతుల బాధలు తొలగిపోయాయని.. ప్రజలు కోరుకున్న తెలంగాణను 100శాతం నెరవేరుస్తానని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కు ప్రజలు కలగన్న తెలంగాణ తప్ప వేరే పనిలేదని.. నా లైన్ ను ఎవ్వరూ మార్చలేరని.. నాకు ఈ వయసులో తెలంగాణ ధ్యాస తప్ప మరొకటి లేదని అన్నారు. నేను కలలు కన్న రీతిలో తెలంగాణ అభివృద్ధి అయ్యేదాకా విశ్రమించను అని కేసీఆర్ అన్నారు.

తప్పులు చేసే అధికారం మాకు లేదని.. ప్రజలకు మంచి తప్ప - తప్పు చేయలేమని కేసీఆర్ అన్నారు. అధికారాన్ని తెలంగాణ కోసం సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయొద్దని.. తెలంగాణ ఏర్పాటుకు ఆరు నెలల ముందే మిషన్ కాకతీయ కార్యక్రమం ఆలోచన చేసామని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కావాలి. చేనేత వర్గానికి నాయకత్వం అవసరం ఉందని.. టీఆర్ఎస్ లో చేనేత వర్గ నేత వెలితి ఉండేద‌ని.. చేనేత సామాజిక వర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. రమణ రూపంలో మంచి రాజకీయ నాయకుడిని చూస్తారని.. త్వరలోనే రమణకు మంచి పదవి ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.



Next Story