సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి : సీఎం కేసీఆర్

CM KCR About Seasonal Diseases. వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ

By Medi Samrat  Published on  23 Aug 2021 3:55 PM GMT
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుండాలి : సీఎం కేసీఆర్

వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున, ముందస్తు నియంత్రణ చర్యలపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి, అధికారులు, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల అధికారులతో ప్రగతి భవన్ లో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్దారించుకోవాలన్నారు. అందుకు సంబంధించి అన్ని దవాఖానాలను పరీక్షలు, చికిత్సకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యశాఖను సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.

గ్రామాల్లో పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఐఆర్ఎస్, ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. అవసరమైన మేర మందులు ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని సీఎం అన్నారు. వారి వారి నివాసాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, దోమకాటు బారిన పడకుండా పిల్లలు, వృద్ధులను కాపాడుకోవాలని అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ వానాకాలం సీజన్ ముగిసే వరకు వైద్యాశాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా వుంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు.


Next Story