పాఠశాలలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!
CM KCR About Schools. తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో
By Medi Samrat
తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలల నిర్వహణ, పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్ కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్షలపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో గతంలో కూడా ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టిందని అన్నారు. దేశంలో కంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. కోవిడ్‌పై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. విద్యాసంస్థల్లో కోవిడ్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.