మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా నెక్లెస్ రోడ్డు(పీవీమార్గ్)లో ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత పీవీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి పీవీ ఘాట్ కు చేరుకున్న గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్.. నివాళులర్పించారు. అనంతరం పీవీ జీవితంపై వెలువడిన పుస్తకాలను గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును ఎంత స్మరించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువేనన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం. పరిపూర్ణమైన సంస్కరణ శీలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతున్నాయి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేశ్ బిగాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.