హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి తెలిపారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్లరేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇచ్చి తీరుతామన్నారు. గడిచిన ఆరు నెలల కాలంలోనే 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందుతోందన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో ఈ నెల 14న సీఎం రేవంత్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. తద్వారా 11.30 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుతుంది. మొత్తంగా 94,72,422 లక్షలను అందుకుంటుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.