ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్ పైన పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని తెలిపారు. తనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడానని.. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడని.. వారి ఇద్దరి ఫోన్ నంబర్స్ మా అనుచరుల ద్వారా తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చానని.. ఈ నంబర్స్ ఎందుకు ఆడిగావ్ అని కూడా తాను తిరుపతన్నను ప్రశ్నించానని చెప్పారు. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తనను తిరుపతన్న అడిగారని.. ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానని పేర్కొన్నారు. వేముల వీరేశం అనుచరుల ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవం అన్నారు. మీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది నా పైన కామెంట్స్ చేస్తున్నారన్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తానన్నారు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను కొశ్చన్ చేశారన్నారు. పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని నేను భావిస్తున్నానన్నారు. నా స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారని.. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానన్నారు.