రేపు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ విచారణ

నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

By Medi Samrat  Published on  23 Dec 2024 4:00 PM GMT
రేపు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ విచారణ

నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో తెలిపారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె తనయుడు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణకు రావాలని అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు.

పుష్ప-2 సినిమా డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో పోలీసులను కించపరిచేలా సన్నివేశం ఉందంటూ ఆయన మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూశానని, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయన్నారు. పోలీసుల పట్ల చిన్నచూపు చూసేలా సీన్లు ఉన్నాయన్నారు. పోలీసులను అగౌరవపరిచేలా సీన్లు ఉన్నందుకు నిర్మాత, దర్శకుడు, హీరోపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు. అసలు సెన్సార్ బోర్డు ఈ సీన్లను కట్ చేయాల్సిందని, కానీ ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదన్నారు.

Next Story