Telangana: సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి
CM Revanth Reddy, Triveni Sangama Saraswati Pushkaralu, telangana
తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిని అద్భుతంగా నిర్వహించడానికి శ్రీకారంగా పవిత్ర సరస్వతి మహా పుష్కరాలతో కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ దక్షిణ ప్రయాగగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర, ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమ సరస్వతి పుష్కరాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
తొలుత పుష్కర ఘాట్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సరస్వతీ దేవి వారి ఏకశిలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. త్రివేణి సంగమం వద్ద పవిత్ర పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ సరస్వతీ దేవి ఆలయానికి చేరుకుని అమ్మ వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రి అక్కడ పవిత్ర పుష్కరాలను ప్రారంభించిన శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సరస్వతి దేవి ఏకశిలా విగ్రహం ముందు నదీ ముఖంగా ఏర్పాటు చేసిన వేదికపై మహా సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో 9 హారతులను అందించిన మహాద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి సహచర మంత్రులతో కలిసి వీక్షించారు. పుష్కరాల సందర్బంగా వారణాసిలో గంగా నదికి హారతినిచ్చే ఏడుగురు వేద పండితులు ప్రత్యేక ఆహ్వానితులుగా సరస్వతి పుష్కరాలకు విచ్చేసి ఈ నవరత్న మాల హారతులను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడుతూ, ఈ పవిత్ర పుష్కరాల్లో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పవిత్ర సరస్వతి పుష్కరాలే మొట్టమొదటివి. ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.
మన సంస్కృతి సంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్తు తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రాంతానికి గోదావరి నది ప్రకృతి ఆశీర్వాదం. గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
దీన్ని పర్యాటక క్షేత్రంగా, ఎంతో చరిత్ర కలిగిన ఇక్కడి కాళేశ్వర దేవాలయం అద్భుతంగా తీర్చిదిద్దడానికి మంత్రి శ్రీధర్ బాబు కోరినట్టు వంద కాదు రెండు వందల కోట్ల రూపాయలైనా, గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ బాధ్యత నేను తీసుకుంటా. రాబోయే మూడేళ్లలో వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతరలను బ్రహ్మాండంగా నిర్వహిస్తాం.
ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం ఒక బాధ్యతగా భావిస్తున్నాను.
మంథని శాసనసభ నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. దేశానికి నాయకత్వాన్ని అందించడమే కాదు. దేశాన్ని ఆర్థిక పథం వైపు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక బలమైన ఆర్థిక దేశంగా ఈనాడు ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక దేశంగా నాయకత్వం వహించిన పీవీ నరసింహారావు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహించారు.
అలాగే ప్రజా జీవితంలో ఆదర్శవంతమైన నాయకుడిగా శ్రీపాదరావు ప్రఖ్యాతులు గడించారు. మూడో తరంలో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడంలో వారి పాత్ర మరువలేనిది.
పవిత్ర సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా అన్ని రకాల వసతులు కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగొద్దని టెంట్ సిటీని కూడా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన అధికారులను అభినందిస్తున్నా” అని ముఖ్యమంత్రి భక్తులకు సరస్వతి పుష్కర శుభాకాంక్షలు తెలియజేశారు.