జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు. ISB నిర్వహించిన నాయకత్వ సదస్సు 2024 లో పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు.
హైదరబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడంలో అందరి సహకారం కావాలని (ISBACON-2024) సదస్సులో కోరారు. దేశంలోని నగరాలతో కాకుండా, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో , సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
ఐఎస్బీ విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు అని, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యసాధనలో సహకరించాలని, వెళ్లే ప్రతి చోట తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్ గా, గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చెప్పారు.