రెండు సీసాల్లో గోదావరి నీళ్లు ఆయ‌న‌కు పంపండి.. తుమ్మ‌ల‌తో సీఎం రేవంత్‌

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు

By Medi Samrat  Published on  15 Aug 2024 11:37 AM GMT
రెండు సీసాల్లో గోదావరి నీళ్లు ఆయ‌న‌కు పంపండి.. తుమ్మ‌ల‌తో సీఎం రేవంత్‌

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ త్వరితగతిన పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిష్టాత్మక సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల సహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో ఇతర జిల్లాల నుంచి కూడా ప్రాజెక్టుల పూర్తికి ఒత్తిడి పెరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అన్ని జిల్లాల్లోని రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

10 యేళ్లు అధికారంలో ఉండి సాగునీటి ప్రాజెక్టులపైన లక్షా ఎనభై వేల కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నారు. సీఎం గా కేసీఆర్ పదేళ్లు, హరీష్ రావు ఐదేళ్లు నీరుపారుదల శాఖ ఉన్నప్పటికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు నీళ్లు కావాలని అడగలేదు..కేసీఆర్, ఆయన అల్లుడు బోగస్ మాటలు చెపుతున్నారని ఆ ఎమ్మెల్యేలకు తెలుసు.. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పులపైన ఉన్నట్లు కేసీఆర్, హరీష్ రావు తీరు ఉందని ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వల్ల వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్నదే కేసీఆర్, హరీష్ రావు ఆలోచన.. సాగునీళ్లు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్, హరీష్ రావుకు లేదని అన్నారు. ఖమ్మం సాగునీటి ప్రాజెక్టులపైన గతంలో నేను సమీక్ష చేశాను.. తక్కువ ఖర్చుతో లక్షా ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని జిల్లా మంత్రులు చెప్పారు.. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇస్తే.. క్రిష్ణా జలాలపైన ఆధారపడే అవసరం ఉండదని తుమ్మల చెప్పారు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి రెండు వారాలకు ఒక సారి సమీక్ష చేసి ప్రాజెక్టు నిర్మాణంలో శ్రద్ద చూపించారని వివ‌రించారు.

సాగునీటి వినియోగంలో కేసీఆర్ అసమర్థతను ప్రధాని మోదీ కి వివరించామ‌న్నారు. నేను, ఉత్తమ్ కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రిని స్వయంగా కలిశాం.. దోపిడి బయటపడుతుందనే డీపీఆర్ లు పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. డీపీఆర్ లు ఇవ్వకపోవడం వల్లనే కేంద్రం ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదన్నారు. అనేక చిక్కుముడులను విప్పుకుంటూ అనుమతులు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాం.. మంత్రి తుమ్మల మాటను నమ్మి రైతులు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చారు.. నాయకులతో పాటు రైతులు కూడా ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చారన్నారు.

తొంభై శాతం పనులు మేం చేశామని హరీష్ రావు అంటున్నారు.. 4 వేల కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము గూడెం ప్రాజెక్టును అంచనా వేసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీ కి ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ ఏపీకి పోయింది. 1500 కోట్ల తో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 18 వేల కోట్లకు పెంచారు. ఇప్పటి వరకు సీతారామ ప్రాజెక్టుపైన కేసీఆర్ ప్రభుత్వం 7500 కోట్లు ఖర్చు చేసింది. 90 శాతం పూర్తి చేస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో చెప్పాలి. క్రమ పద్దతిలో పనులు పూర్తి చేయలేదన్నారు. పంపులు, మోటార్లు తయారు చేయించి కమిషన్లు మెక్కారని ఆరోపించారు.

4 యేళ్లుగా మోటార్లు ఇక్కడ పడి ఉన్నాయి.. సమీక్ష చేసి కరెంటు కనెక్షన్లు ఇప్పించి మోటార్లు ఆన్ చేయించాం.. ఆరునెలలు కష్టపడి పంప్ లు పనిచేసేలా చేశాం.. గోదావరి తల్లే మిమ్మల్ని తడిపి ఆశ్వీరదించింది.. మా ఆలోచనలో స్వార్థం లేదు కాబట్టే అన్నీ సజావుగా జరిగాయన్నారు. గోదావరి జలాలను ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలనే స్వాతంత్ర్యం దినోత్సవం రోజు వచ్చాను.. నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు మంత్రి పొంగులేటి నీళ్లు తెచ్చుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన నల్గొండ జిల్లా నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయ‌న్నారు.

మా శ్రమను తగ్గించడానికి హరీష్ రావు ఒకటే మాట్లాడుతున్నాడు.. తోక మాత్రమే మిగిలిందంటున్న హరీష్ రావు పదేళ్లు ఏం చేశారు.. పదేళ్లు చేయలేని పనిని ఆరునెలల్లో చేశాం.. మీ చెత్తబుద్ది తెలుసుకాబట్టే చెప్పుతో కొట్టారు.. ఖమ్మం జిల్లాలో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలేదు.. అడవి పందుల్లా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి నెలా 6,500 కోట్లు వడ్డీ కడుతున్నం.. ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినప్పటికి ఖమ్మం ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నాం.. చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్, హరీష్‌ రావును పట్టించుకోం.. కేసీఆర్ చెల్లని రూపాయి.. తీరిక ఉన్నప్పుడు వచ్చి కేసీఆర్, హరీష్ రావు గోదావరి జలాలను చల్లుకోని పోవాలి.. రెండు సీసాల్లో గోదావరి నీళ్లు కేసీఆర్ కు పంపించాలని మంత్రి తుమ్మలను కోరారు.

Next Story