మార్కెట్‌లో చికెన్ ధరలు ఆకాశనంటుతున్నాయి. చికెన్ ధరలు కొండెక్కి కూర్చోవడంతో.. మాంసాహార ప్రియులు దిగులు చెందుతున్నారు. కొందరికి రోజు ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో వంట నూనెల ధరలు పెరిగాయి. ఇక పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాంసం ధరలు సైతం ప్రియమైపోయాయి. గడిచిన 20 రోజుల్లోనే చికెన్ ధర ఏకంగా రూ.100 పెరిగింది. మాంసం ప్రియులకు చికెన్ ధరల సెగ తగులుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా మహామ్మారి విజృంభణ మొదలైన నాటి నుండి మాంసాహారానికి డిమాండ్ పెరిగింది. దీంతో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు పెరగడంతో సామాన్యులకు చికెన్ ఒక అందని ఆహార వస్తువుగా మిగిలిపోతోంది. చికెన్ ధర 20 రోజుల కిందట కిలో రూ.170గా ఉండగా.. ఇప్పుడు రూ.285కి అమ్ముతున్నారు.
అయితే ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో రోజుకు సగటున 10 లక్షల కిలోల చికెన్ మాంసం కొనుగోలు చేస్తారని అంచనా, ఇక ఆదివారం నాడైతే 15 లక్షల కిలోలకు పైగా ఉంటుంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చికెన్ మాంసం అమ్మకాలు అంచనాలకు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదువుతున్నాయి. ఎండల ధాటికి కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు కోళ్ల దాణ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో చికెన్ ధరలు బాగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో చికెన్ ధర కిలో రూ.350 నుండి రూ.400 పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని కోళ్ల పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.