వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబుకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవల విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో రమేశ్ బాబు పేరు ప్రకటించలేదు. పౌరసత్వం సమస్య కారణంగా పేరు జాబితాలో చేర్చలేదని సీఎం ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు’ గా (అడ్వయిజర్ టు గవర్నమెంట్ ఆన్ అగ్రికల్చర్ అఫైర్స్) వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్ అయిన వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో రమేశ్ బాబు 5 ఏండ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది.
కాగా.. విద్యాధికుడైన డా. చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’ లో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టాను పొందారు. రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ.. దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో.. పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్ గా ఆయనకు అగ్రికల్చర్ ఎకానమి’ అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రమేశ్ బాబు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రికి సలహాదారుగా వ్యవహరించనున్నారు.