ఇక నుంచి దేవాదాయశాఖ పరిధిలోకి చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం

హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది.

By Knakam Karthik
Published on : 27 Feb 2025 7:45 AM IST

Telangana, Hyderabad, Charminar, Bhagyalakshmi Temple,  Endowment

ఇక నుంచి ఆ శాఖ పరిధిలోకి, చార్మినార్ 'భాగ్యలక్ష్మీ' ఆలయం

హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దేవాదాయశాఖ పరిధిలోకి రానుంది. ఈ మేరకు దేవాదాయశాఖను ట్రిబ్యునల్ ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మీ టెంపుల్ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాస్, మహంత్ రాంచంద్ర దాస్ 1960 దశకం నుంచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. భాగ్యలక్ష్మీ ఆలయానికి తక్షణమే ఈవోను నియమించి ఆలయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ముందుకు వెళ్లాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ తర్వాత ఈ ఆదేశాలు జారీ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

యూపీకి చెందిన రాజ్ మోహన్ దాస్ ఆలయంపై ఆజమాయిషీ చెలాయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆలయ నిర్వహణకు సంబంధించి ఏకగ్రీవ నియంత్రణ ఉండాలని ఆమె కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎండోమెంట్ ట్రిబ్యునల్, ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ ఆలయ నిర్వహణకు ప్రత్యేక ఈవోను (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) నియమించాలని ఆదేశించారు. ఆలయ ఆదాయ వ్యయం, నిర్వహణ విధానాలు అధికారిక పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయంతో ఆలయ అభివృద్ధికి సహకారం అందుతుందని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మార్గం సుగమమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story