ములుగు జిల్లాలో ఆటవిక చర్య.. వివాహేతర సంబంధం ఆరోపణలతో అగ్ని పరీక్ష
తనపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు అవాస్తమని నిరూపించుకోవాలని కుల పెద్దలు ఓ వ్యక్తికి అగ్నిపరీక్ష పెట్టారు.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 11:29 AM ISTఅగ్ని పరీక్ష
పది తలల రావణాసురుడి చెర నుంచి విముక్తి పొందిన సీతాదేవీ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు అగ్ని పరీక్ష ఎదుర్కొందని పురాణాల్లో చదివాం. అయితే.. సరిగ్గా అలాంటి పరీక్ష నేటి సమాజంలో ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. తనపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు అవాస్తమని నిరూపించుకోవాలని కుల పెద్దలు అతడికి సూచించి అగ్ని పరీక్ష పెట్టారు. ఎర్రగా కాలిన గడ్డపారను చేతులతో తీయాలని హుకుం జారీ చేశారు. అతడి చేతులకు గాయాలు అయితే రూ.11లక్షలు జరిమానా చెల్లించాలన్నారు. గాయాలు కాకుండా అతడు బయట పడినా జరిమానా కట్టాల్సిందేనని కుల పెద్దలు వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.
బంబెరుపల్లి గ్రామంలో జగన్నాథ గంగాధర్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. పాత ఇనుము వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. తన భార్యతో గంగాధర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆరోపిస్తూ కుల పెద్దలను ఆశ్రయించాడు. దీనిపై గత మూడు నెలలుగా పలు మార్లు పంచాయతీని నిర్వహించారు కులపెద్దలు.
తనకు ఆ మహిళతో ఎలాంటి సంబంధం లేదు అని గంగాధర్ నెత్తి నోరు బాదుకుని మరీ ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకునే నాథుడే కరువు అయ్యాడు. గంగాధర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ముందుగా రూ.11లక్షలు డిపాజిట్ కింద పెట్టాలని కండిషన్ పెట్టారు.
ఇందుకు గంగాధర్ ఒప్పుకున్నాడు. మూడు నెలలుగా పంచాయితీ జరగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో అటవికంగా ఆలోచించిన పెద్ద మనుషులు అతడికి అగ్నిపరీక్ష పెట్టారు. ఎర్రగా కాలిన గడ్డపారను చేతులతో పట్టుకొని నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో గాయాలు అయితే.. జరిమానా కింద రూ.11 లక్షలు చెల్లించాలని ఆదేశించారు.
గోవిందరావు పేట మండలం లక్నవరం చెరువు సమీపంలో పెద్ద మనుషుల సమక్షంలో పిడకలతో అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అందులో గడ్డపారను ఉంచారు. చెరువులో స్నానం చేసి తడి బట్టలతో వచ్చిన గంగాధర్ తన చేతులతో అందరూ చూస్తుండగా ఎర్రగా కాలిన గడ్డపారను గుండంలోంచి తీసి బయట పడేశాడు. చేతులు కాలకపోవడంతో గంగాధర్ అగ్నిపరీక్షలో నెగ్గాడు. అయినప్పటికీ శాంతించని పెద్దమనుషులు తప్పు ఒప్పుకోవాల్సిందేనని తేల్చేశారు.
రూ.11లక్షలు చెల్లించాల్సిందేన్ని వేధించడం మొదలు పెట్టారు. దీంతో విసిగిపోయిన గంగాధర్ తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిపాజిట్ చేసిన రూ.11 లక్షల్లో ఆరు లక్షల రూపాయలు. ఖర్చుల పేరుతో పెద్దమనుషులు వాడుకున్నారని వాపోయారు. గంగాధర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.