డీకే అరుణ బహిరంగ క్షమాపణ చెప్పాలి : చ‌ల్లా వంశీచంద్ రెడ్డి

నాకు మహిళలంటే అత్యంత గౌరవం, రాజకీయాల్లోకి వ్యక్తి జీవితం తీసుకురావడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదని మహబూబ్ నగర్ పార్ల‌మెంట్‌ కాంగ్రెస్ అభ్య‌ర్ధి చ‌ల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  23 March 2024 12:37 PM GMT
డీకే అరుణ బహిరంగ క్షమాపణ చెప్పాలి : చ‌ల్లా వంశీచంద్ రెడ్డి

నాకు మహిళలంటే అత్యంత గౌరవం, రాజకీయాల్లోకి వ్యక్తి జీవితం తీసుకురావడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదని మహబూబ్ నగర్ పార్ల‌మెంట్‌ కాంగ్రెస్ అభ్య‌ర్ధి చ‌ల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. డీకే అరుణ తాను నన్ను ఎమ్మెల్యే చేసిందన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను.. నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ.. గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలు.. గెలిపించుకుంది కల్వకుర్తి ప్రజానీకం.. అంతే కానీ అరుణమ్మ విజ్ఞత లేకుండా మాట్లాడొద్దన్నారు. 2009-2014 లో ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యునిగా నేను సిఫార్సు చేస్తేనే నీకు టికెట్ వచ్చిన విషయం మర్చిపోయారా అని ప్ర‌శ్నించారు.

గద్వాల్ లో నీ కుటుంబ ప్రయోజనాల కోసం నీ అల్లుడిని ఎమ్మెల్యే చేయడానికి ఒక బీసీ బిడ్డను బలి పశువును చేశార‌ని ఆరోపించారు. మక్తల్ భాజాపా అభ్యర్థిని కాదని నీ తమ్ముడికి అనుకూలంగా వ్యవహరించింది వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు. 2014లో నా ఓటమికి డీకే అరుణ శతవిధాలుగా ప్రయత్నం చేసినా.. ఆ కుట్రలన్నిటిని చేధించి కల్వకుర్తి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాన‌ని తెలిపారు. డీకే అరుణ కాంగ్రెస్ లోకి రాక మునుపే నేను కాంగ్రెస్ పార్టీలో అప్పటికే సీనియర్ అని తెలిపారు.

నేను 2006లో ఏఐసీసీ మెంబర్ గా ఉంటే, మీరు 2014లో ఏఐసీసీ మెంబర్ అయ్యారని గుర్తుచేశారు. నేను జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శి గా ఉన్నపుడు మీరు రాష్ట్రంలో పీసీసీ ఉపాధ్యక్షులు.. డీకే అరుణది పూటకో పార్టీ మారే అవకాశవాద రాజకీయం. నాది, ఎంత కష్టం వొచ్చినా, నష్టం వొచ్చినా నమ్మిన సిద్ధాంతం, పుట్టిన పార్టీకి కట్టుబడే విలువల రాజకీయం అని పేర్కొన్నారు. నన్ను నాన్-లోకల్ అంటున్నారు కదా, మీరు ఏ స్థానికత ప్రాతిపదికన పాన్ గల్ నుండి జెడ్పిటిసి గా పోటీ చేశారని ప్ర‌శ్నించారు. నేనే పక్కా లోకల్ కల్వకుర్తి శేరి అప్పరెడ్డిపల్లిలో పుట్టిన.. ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను అని పేర్కొన్నారు. నేను నాన్-లోకల్ అయితే గుజరాత్ కు చెందిన నరేంద్ర మోడీ వారణాసి నుండి, హుజారాబాద్ వాస్తవ్యుడైన ఈటెల మల్కాజ్ గిరి నుండి ఎలా పోటీ చేస్తారని ప్ర‌శ్నించారు. ఈ విషయంలో డీకే అరుణ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పాలమూరు లో మైన్ మాఫియా, వైన్ మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, క్రషర్ మాఫియా లను నెలకొల్పడానికి మళ్ళీ భాజాపా నుండి పోటీ చేయడానికి వచ్చారని ఆరోపించారు. నా తల్లి గారి ఊరు నారాయణపేట అని చెప్పుకునే మీరు మీ ప్రాంతానికి ఏం చేశారని ప్ర‌శ్నించారు. నారాయణపేట కు మంజూరైన సైనిక్ స్కూల్ ను వేరే రాష్ట్రానికి తరలిస్తే ఎందుకు అడ్డుకోలేదన్నారు. వేముల రోడ్డు, మహబూబ్ నగర్-భుత్పూర్ మధ్యన బ్రిడ్జిల నిర్మాణాలను ఎందుకు చేపట్టలేదని ప్ర‌శ్నించారు.

ధన్వాడ బిడ్డను అని చెప్పుకునే మీరు తీలేరు నుండి కేవలం 6 కి.మీ. కాల్వ తవ్విస్తే.. దన్వాడ పెద్ద చెరువుకు నీల్లొచ్చే అవకాశం ఉన్నా మంత్రి హోదాలో ఎందుకు ఆ పని చేయలేక పోయారని ప్ర‌శ్నించారు. నడిగడ్డ ప్రాంతపు 80వేల ఎకరాలు బీడుగా మార్చే అప్పర్ భద్ర పెంపును డీకే అరుణ ఎందుకు అడ్డుకో లేకపోయారని అడిగారు. ఆర్డీఎస్ కేటాయింపులు 15టీఎంసీలు.. కేవలం 4 టీఎంసీలు పారుతుంటే మంత్రిగా అప్పట్లో మీరేం చేశారని ప్ర‌శ్నించారు. కుసంస్కార రాజకీయాలు చేయడం ఇప్పటికైనా మానుకోండని హితువు ప‌లికారు. వంశీచంద్ రెడ్డిని ఎలాగైనా ఓడగొట్టాలనే డీకే అరుణమ్మ నాపై దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు. నిన్న నన్ను నాన్-లోకల్ అని అనడంతోనే డీకే అరుణ తన రాజకీయ జీవితానికి మరణ శాసనం తానే లిఖించికున్నారని.. నా వ్యాఖ్యల పై ఎవ్వరు బహిరంగ చర్చకు వచ్చినా నేను సిద్ధమేన‌న్నారు.

Next Story