మీలా కాదు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం..కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 11 March 2025 9:49 PM IST
మీలా కాదు, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం..కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి సెటైర్లు
గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. మేం చేయలేమంటూ, వేరే వారిపై నిందలు వేసి, సాకులు చెప్పి మా బాధ్యతల నుంచి ఎప్పుడూ కూడా తప్పుకునే ప్రయత్నం చేయలేదు, చేయబోం..అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఇన్ని నెలల తర్వాత రూ.1.5 లక్షల కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం చిన్న పిల్లల నవ్వులాటగా ఉంది. ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి అయినా వనరులకు తగ్గుట్టుగా కార్యాచరణ రూపొందించుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హయాంలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందనుకున్నానని, ఇప్పుడు రూ.7.5 లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసిందని, అప్పులపై వడ్డీలు చెల్లించలేకపోతున్నానని చెప్పడం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అసమర్థతకు అద్ధం పడుతోంది. వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇప్పుడు కేంద్రాన్ని డబ్బులు అడగడం పూర్తిగా దివాళాకోరుతనం.. అని కిషన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డును తప్పకుండా అమలు చేస్తామని బీజేపీ హామీని ఇచ్చినట్లే పూర్తి చేస్తున్నాం. రైల్వే ప్రాజెక్టులకు ఇచ్చిన హామీ కంటే ఎక్కువ నిధులే కేటాయిస్తాం. హైదరాబాద్ కోచ్ ఫ్యాక్టరీ 65 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపన చేశారు. రూ.750 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నా.. 2026 ఏప్రిల్‌లో కోచ్‌లో ఉత్పత్తి కూడా ప్రారంభిస్తాం. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తెలియకుండా.. దాని గురించి రైల్వే మంత్రికి మెమోరాండం ఇవ్వడం విడ్డూరంగా ఉంది...అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.