సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని అన్నారు. నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం, ఇలాంటి ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. నివాస ప్రాంతాల మధ్య ఉన్న వాణిజ్య సముదాయాలను అధికారులు తరచుగా పర్యవేక్షించాలన్నారు. ప్రమాదాల నివారణకు కనీస వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్నిమాపక శాఖలో సిబ్బందిని పెంచాలని, కేంద్రాల సంఖ్యను పెంచాలని, అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలు అందించాలని కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను జేఎన్‌టీయూ నిపుణులు ప్రొఫెసర్‌లు డీఎన్‌కుమార్, శ్రీలక్ష్మిలతో కూడిన బృందం ఆదివారం పరిశీలించింది. భవన నాణ్యతా ప్రమాణాలను పరిశీలించినట్లు జేఎన్‌టీయూ బృందం వెల్లడించింది స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌లుగా పోలీసులు గుర్తించారు.