సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు
By తోట వంశీ కుమార్ Published on 17 March 2023 7:59 AM ISTస్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యం
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరుగురు మరణించారు. చనిపోయిన వారిలో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.
ప్యారడైజ్ సమీపంలోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 8 అంతస్తులు ఉన్న ఈ భవనంలో మొదట ఏడో అంతస్తులో షార్ట్ సర్య్కూట్‌తో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ఐదో అంతస్తులో పేలుడు సంభవించడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. మంటలు చెలరేగిన వెంటనే కాంప్లెక్స్‌లో పనిచేసే వారు, షాపింగ్ కోసం వచ్చిన వారు భయంతో కిందకు పరుగులు తీశారు. ఐదో అంతస్తులో పేలుడు జరగడంతో కొందరు కిందకు రాలేకపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పది ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
ఓ వైపు మంటలను ఆర్పుతూనే మరో వైపు అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించారు. భవనంలో 15మందికి పైగా చిక్కుకుని పోవడంతో వారిని క్రేన్ల సాయంతో కిందకు దించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత ఓ గదిలో ఆరుగురు అపస్మారక స్థితిలో కనిపించగా వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రమీల, మర్రిపల్లికి చెందిన వెన్నెల, నర్సంపేటకు చెందిన శ్రావణి, ఖమ్మంజిల్లా నేలకొండపల్లికి చెందిన త్రివేణి, నర్సంపేటకు చెందిన శివలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 23 ఏళ్ల లోపు వయస్సు వారే. అపోలో ఆస్పత్రిలో కేసముద్రంకు చెందిన ప్రశాంత్ మరణించాడు.
అగ్నిప్రమాద సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో భవనం లోపల ఉన్న వారు వారి వద్ద నున్న సెల్‌ఫోన్లలో లైట్ వేసి కిందకి చూపిస్తూ కాపాడాలంటూ వేడుకోవడం కనిపించింది.