హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి నిన్న ఉదయం అనుమతులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎనిమిదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించటంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైంది, హైదరాబాద్ నుంచి శామీర్‌పేట, హైదరాబాద్ నుంచి మేడ్చల్ దిశగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.