గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం, తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టుకు ఆమోదం

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

By Knakam Karthik
Published on : 3 April 2025 6:54 AM IST

Telangana, Adilabad Airport, Central Government, Indian Air Force

గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం, తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టుకు ఆమోదం

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలోని మామునూరు ఎయిర్‌ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఎయిర్ పోర్టుకు భారత వాయుసేన పచ్చజెండా ఊపింది. పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు..అని తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టునుఅభివృద్ధి చేసి పౌర విమానయాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి భారత వాయుసేన అంగీకరించింది.

అదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు భారత వాయుసేన సముఖతవ్యక్తం చేసింది. ఈ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ గా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్టు మంత్రి కోమ‌టిరెడ్డి తెలిపారు. పౌర విమానాల రాకపోకలకు అనువుగా రన్‌వే పునర్నిర్మాణం చేయడం, పౌర టర్మినల్ ఏర్పాటు, ఎయిర్‌క్రాఫ్ట్ ఎప్రాన్ (విమానాలు నిల్చోవడానికి, మలుపులు తిరగడానికి, ఇతర విమానయాన కార్యకలాపాలకు ఉపయోగించే నిర్దిష్ట ప్రాంతం) వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయడం వంటి పనులు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

Next Story