దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి నేడు ఎమ్మెల్సీ కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారించనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారణ చేయనుంది. కాగా.. విచారణకు మొదట సీబీఐ డిసెంబర్ 6వ తేదీ సూచిస్తూ లేఖ రాసింది. అయితే.. ఆ రోజు ఇతర కార్యక్రమాలు ఉండడంతో 11,12,14,15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని కవిత బదులుఇచ్చింది. దీంతో 11న విచారణ చేస్తామని సీబీఐ తెలిపింది.
సీబీఐ అధికారులు రానున్న నేపథ్యంలో కవిత నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో సీబీఐ వివరణ తీసుకోనుంది. మరోవైపు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. 'డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెయర్ ఫియర్'( యోధుడి కుమారై.. ఎప్పుడూ భయపడదు), 'వీ ఆర్ విత్ యూ కవితక్కా'( మేము నీతోనే ఉన్నాం కవితక్కా) అంటూ కవిత నివాస ప్రాంతంతో పాటు పరిసరాల్లో శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే.. శనివారం కవిత సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. మంత్రి మండలి సమావేశం ముగిసిన తరువాత ఆమెతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేది తెలియరాలేదు.