తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. యాప్స్‌ను ప్రమోట్ చేశారని ఇప్పటివకే పలువురు టాలీవుడ్ ప్రముఖులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, హీరోయిన్ అనన్య నాగళ్ల ఉన్నారు. లేటెస్ట్‌గా ఈ జాబితాలో టాలీవుడ్ బిగ్ స్టార్స్ నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ షోలో ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
వీరు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశారంటూ హైదరాబాద్ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు అందింది. ఫన్ 88 బెట్టింగ్ యాప్ ను బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ లు ప్రమోట్ చేశారని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో జరిగిన అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ లో ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ చూసి తాను బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నానని.. బెట్టింగ్ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.