గోషామహల్ బీజేపీఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలతో మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాజాసింగ్ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.
అందులో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయని వారిని గుర్తించి బుల్డోజర్లతో వారి ఇళ్లను తొక్కిస్తామంటూ హెచ్చరించారు. దీనిపై నోటీసులు జారీ చేసిన ఈసీ ఈనెల 19 మధ్యాహ్నం 1 గంటలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ గడువు లోపు రాజాసింగ్ సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాజాసింగ్‌పై హైదరాబాద్ వెస్ట్ జోన్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.