ఎమ్మెల్యేకు బెదిరింపులు.. నిందితుడిపై లుక్ అవుట్ నోటీస్‌ జారీ చేసిన పోలీసులు

ఎమ్మెల్యేపై బెదిరింపులకు పాల్పడి.. 20 లక్షల రూపాయల డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి లుక్ అవుట్ సర్కులర్ జారీ చేసిన‌ట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు

By Medi Samrat  Published on  30 Oct 2024 9:37 AM GMT
ఎమ్మెల్యేకు బెదిరింపులు.. నిందితుడిపై లుక్ అవుట్ నోటీస్‌ జారీ చేసిన పోలీసులు

ఎమ్మెల్యేపై బెదిరింపులకు పాల్పడి.. 20 లక్షల రూపాయల డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి లుక్ అవుట్ సర్కులర్ జారీ చేసిన‌ట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యంకు గత సెప్టెంబర్ నెలలో 28వ తేదీన మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో తెలియని నెంబర్ +447886696497 నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్య‌క్తి.. తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని.. లేనియెడల రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు ఎమ్మెల్యే సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని తేల్చారు. అఖిలేష్ రెడ్డి ప్రస్తుతం లండన్ లో ఉన్నాడని, అక్కడి నుండి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలిందని.. సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

Next Story