'ఒమిక్రాన్' ను ఎదుర్కొనేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ

Cabinet Sub Committee on Omicron Variant. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నేడు ప్రగతి భవన్ లో జ‌రిగింది

By Medi Samrat  Published on  29 Nov 2021 4:12 PM GMT
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నేడు ప్రగతి భవన్ లో జ‌రిగింది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. కరోనా పరీక్షలు మరిన్ని ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సన్నద్దతపై కేబినెట్ చర్చించింది. కరోనా నుంచి "ఒమిక్రాన్" పేరుతో కొత్త వేరియంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్ కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిని తెలిపారు. నివేదిక సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని అన్ని రకాలుగా తాము సంసిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు.

రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్ధంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియను సమీక్షించి, అదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఉంటారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.


Next Story
Share it