సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ.. సర్వత్రా ఉత్కంఠ..
Cabinate Meet In Pragathi Bhavan. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్
By Medi Samrat Published on 17 Jan 2022 10:25 AM GMT
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని.. అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకోని వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ మంత్రిని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేఫథ్యంలో సంచలన ప్రకటన వెలువడే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నందున కేబినేట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.