తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు.. ఎంత వరకూ పెరగనున్నాయంటే..

Bus Charges Hike In Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగే అవకాశం ఉంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

By Medi Samrat  Published on  7 Nov 2021 1:27 PM GMT
తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు.. ఎంత వరకూ పెరగనున్నాయంటే..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగే అవకాశం ఉంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే అధికారులు చార్జీల పెంపుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఎక్స్ ప్రెస్, ఆపై సర్వీసులు, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ లలో కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపనున్నారు.

డీజిల్‌ ధరలు 30 శాతం పెరగడంతో ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ చెప్పారు. ఈ విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 2019 డిసెంబర్‌లో ప్రతీ కిలోమీటర్‌కు సగటున 20 పైసల చొప్పున పెంచారు. దీంతో ఏటా రూ.550 కోట్లు అదనంగా ఆదాయం రాగా ఆ మేర ప్రజలపై భారం పడింది. అప్పుడు డీజిల్ ధర లీటర్‌కు రూ. 68 ఉండగా.. ప్రస్తుతం రూ.94కు చేరింది. ఇటీవల కేంద్రం సుంకం తగ్గించడంతో ఆర్టీసీ రాయితీ ధర కలుపుకొని రూ.90గా ఉంది.

ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. బస్సు చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌‌కు రెండు నెలల క్రితం ఫైల్ పంపామని, అది ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇవాళ మరోసారి రివ్యూ చేసి మరోసారి ప్రతిపాదనలు పంపామని ఆయన చెప్పారు. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని తెలిపారు. డీజిల్ పై కేవలం ఒక్క శాతం మాత్రమే కేంద్రం తగ్గించిందన్నారు. చార్జీల పెంపుతో పల్లె వెలుగు లాంటి బస్సులపై పెద్దగా భారం ఉండకున్నా, దూరప్రాంతాలకు వెళ్లే బస్సులకు చార్జీలు కొంత పెరుగుతాయన్నారు బాజిరెడ్డి.


Next Story
Share it